: యాపిల్ ను దెబ్బకొట్టేందుకు... స్మార్ట్ ఫోన్ల ప్రచారం కోసం రూ. 100 కోట్ల ఖర్చు!
యాపిల్ స్మార్ట్ ఫోన్ విక్రయాలపై పై చేయి సాధించేందుకు శాంసంగ్ సంస్థ భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ ల ప్రమోషన్ కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. వచ్చే వారంలో యూఎస్ లో విడుదల కానున్న ఈ ఫోన్లను ప్రజలకు పరిచయం చేసేందుకు భారీగా వెచ్చించనున్నామని, 8వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో లభ్యమవుతాయని శాంసంగ్ వెల్లడించింది. కాగా, శాంసంగ్ ప్రచారం జరుపుతున్న సమయంలోనే యాపిల్ సంస్థ ఐఫోన్ 6ఎస్ మోడల్ కోసం కనీసం రూ. 30 నుంచి రూ. 40 కోట్ల వరకూ మార్కెటింగ్ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. శాంసంగ్ ఇండియాలో ఓ ఫోన్ విడుదల చేస్తుంటే, యాపిల్ ఈ స్థాయిలో తన ఫోన్ కు ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి. కాగా, గత సంవత్సరం విడుదలైన గెలాక్సీ ఎస్6తో పోలిస్తే, గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ ధరలు తక్కువగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్ 6ఎస్ ప్రస్తుతం రూ. 44 వేల నుంచి రూ. 45 వేల మధ్య ఉండగా, శాంసంగ్ ఫోన్లు సైతం అదే ధరకు లభించవచ్చని తెలుస్తోంది.