: నా కొడుకు తెలుగుదేశంలో ఎందుకు చేరాడంటే...: కలమట తండ్రి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి, ఆయనకు తోడుగా నిలవాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడు కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరాడని ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు వెల్లడించారు. తాను, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, జైపాల్ రెడ్డి, గౌతు లచ్చన్న తదితరులంతా 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, ఆ తరువాత ఎన్టీ రామారావు కోరిక మేరకు తెలుగుదేశంలోకి వచ్చానని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించానని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకూ తాము లొంగలేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి, కరకట్టల నిర్మాణాలకు, రోడ్లు, మంచినీటి సౌకర్యాల కల్పనకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేదని ఆరోపించారు. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడామని, తిరిగి అధికారంలో ఉన్న టీడీపీతో కలిసుంటే ప్రజలు అభివృద్ధి దిశగా నడుస్తారని భావించే, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.