: చిదంబరం సతీమణికి సీబీఐ సమన్లు... 10న విచారణకు రావాలంటూ తాఖీదు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఝలకిచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ చిదంబరం సతీమణి నళినీ చిదంబరానికి కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్ అభ్యర్థన మేరకు శారదా కేసులో నళినీ చిదంబరం కోర్టులో వాదనలు వినిపించారు. ఇందుకోసం శారదా చిట్ ఫండ్ ఆమెకు రూ.1 కోటిని ఫీజుగా చెల్లించింది. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ శారదా చిట్ ఫండ్ యాజమాన్యం, మనోరంజన్ సింగ్ లతో పాటు నళిని చిదంబరం పేర్లను రెండు నెలల క్రితం చార్జీ షీటులో చేర్చింది. ఇతరుల విషయంలో స్పష్టత ఇచ్చిన సీబీఐ నళినీని ప్రమేయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగా చార్జీషిటులో పేర్కొన్న వారిని సాక్షులుగానో, నిందితులుగానో ప్రస్తావిస్తారు. అయితే నళిని పేరును మాత్రమే ప్రస్తావించిన సీబీఐ... ఆమెను మాత్రం సాక్షిగా పేర్కొనలేదు. అదే సమయంలో నిందితురాలిగానూ పేర్కొనకపోవడం గమనార్హం.