: మహాశివరాత్రి 2016; పూజా సమయం, తిథి, విధి!
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మహా శివరాత్రి పర్వదినం ఈ సంవత్సరం మార్చి 7న వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో లయకారుడిని పూజించే వేళ, శుభ సమయాలు, తిథి తదితర వివరాలు మీకోసం. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం (అమావాస్య అంతం), మహాశివరాత్రి మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశినాడు వస్తుంది. అదే పౌర్ణమితో ముగిసే క్యాలెండర్ల ప్రకారం, పాల్గుణ కృష్ణ త్రయోదశి లేదా చతుర్దశి తిథుల్లో వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎలా చూసినా, మహా శివరాత్రి ఒకే రోజు వస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి ఘడియలు మార్చి 7న మధ్యాహ్నం 1:20 నుంచి మార్చి 8న ఉదయం 10:34 వరకూ ఉంటుంది. శివుడిని పూజించేందుకు నిషిత కాల్ పూజ అత్యంత అనుకూలం. ఈ సమయంలోనే శివుడు భూమిపై శివలింగాల రూపంలో ఉంటాడని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం నిషిత కాలం అర్ధరాత్రి 12:06 నుంచి 12:56 వరకూ ఉంది. తొలి ప్రహార పూజ 7వ తేదీన సాయంత్రం 6:21 నుంచి రాత్రి 9:26 వరకూ జరుగుతుంది. రెండో ప్రహార పూజ 7న రాత్రి 9:26 నుంచి అర్ధరాత్రి 12:31 వరకూ, మూడో ప్రహార పూజ అప్పటి నుంచి 8 తెల్లవారుఝామున 3:36 వరకూ, నాలుగో ప్రహార పూజ ఉదయం 6:42 వరకూ సాగుతుంది. ఈ సమయాల్లో శివునికి జలాభిషేకాలు నిర్వహించి భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.