: చక్రి తల్లి, సోదరుడు అరెస్ట్... పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలింపు


టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం ఆయన కుటుంబంలో పొడచూపిన వివాదాలు మరింత ముదిరాయి. చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ... భార్య శ్రావణిల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాలు మరింత జటిలమయ్యాయి. చక్రి కష్టార్జితం భార్యగా తనకే సొంతమంటూ శ్రావణి వాదిస్తుండటం, తల్లిగా తనకూ హక్కు ఉందని విద్యావతి ప్రతివాదనకు దిగడంతో సమస్య ముదిరింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇరుపక్షాలు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. చక్రి బతికుండగా సోమాజిగూడ పరిధిలోని రాజ్ భవన్ రోడ్డులో ఓ విల్లాను కొనుగోలు చేశారు. ఆ విల్లాలోనే ఇప్పుడు శ్రావణి ఉంటోంది. విధిలేని పరిస్థితుల్లో అద్దె ఇంటికి మారిన విద్యావతి, మహిత్ లు అద్దె చెల్లించడం కూడా కష్టం కావడంతో అద్దె ఇంటిని ఖాళీ చేసి న్యాయం చేయాలంటూ రాజ్ భవన్ రోడ్డులోని చక్రి విల్లా ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం సామాన్లంతా సర్దుకుని విల్లా ముందుకు చేరిన విద్యావతి, మహిత్ లు తమకు గూడు దొరికే దాకా అక్కడే బస చేస్తామంటూ రోడ్డెక్కారు. తాజాగా నిన్న అర్ధరాత్రి వీరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అధికార నివాసం రాజ్ భవన్ తో పాటు ప్రముఖులు నివాసముండే సోమాజిగూడ పరిధిలో వారు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలోనే న్యూసెన్స్ కేసు కింద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యావతి, మహిత్ లను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News