: తప్పు చేయను...చేస్తే ఇక ఉండను: మురళీమోహన్


తాను తప్పు చేయనని, ఒకవేళ చేస్తే ఆ తర్వాత ఉండను అని టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ అన్నారు. హైదరాబాద్ మినహా గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి.. మరి ఏ ఇతర జిల్లాలో తనకు సెంటు భూమి కూడా లేదని అన్నారు. వెస్ట్ గోదావరిలో మాత్రం తన భార్యకు వాళ్ల అమ్మనాన్నలిచ్చిన కొబ్బరి తోట మాత్రం ఉందని.. అది సుమారు ఏడు ఎకరాలు ఉంటుందని అన్నారు. జయభేరి పేరిట, బినామీల పేరిట వందల ఎకరాలు కొన్నాను అన్నది అవాస్తవమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ బినామీ పేరుతో తాను కొన్నానో చెబితే యాభై శాతం భూములు వారికి ఇచ్చి, మిగిలినది నవ్యాంధ్ర రాజధాని ఫండ్ గా ఇస్తానని చెప్పారు. తాను భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపిస్తున్న వారి వద్ద ఆధారాలుంటే ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి హాయ్ లాండ్ తో సంబంధాల గురించి ఆయన మాట్లాడుతూ, దానిని అమ్ముతారా? అని తాను ఏనాడు అడగలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాత్రమే తాను ఆ హాయ్ లాండ్ కు వెళ్లానని చెప్పారు. ఆ సందర్భంలో హాయ్ లాండ్ నిర్వాహకులు అక్కడున్న బ్యాటరీ కారులో తనను తిప్పుతామన్నారని చెప్పారు. హాయ్ లాండ్ ను కొనుగోలు చేసేంత డబ్బు తన వద్ద లేదన్నారు. సినిమా వాళ్ల జీవితాలను బూతద్దాలలో చూస్తారని, పది రూపాయలు ఉంటే పది లక్షలు ఉన్నాయనుకుంటారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ, గుంటూరు, వైజాగ్ లో తాను వ్యాపారం చేయాలనుకున్నానని చెప్పారు. అయితే, రెండు సంవత్సరాలుగా తనకు నచ్చిన భూములు ఇక్కడ ఎక్కడా దొరకలేదన్నారు. అయితే, విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఒక ఏడు ఎకరాల భూమిని గుర్తించామని, అది కొనుగోలు చేద్దామని వెళితే యజమాని అమ్మనని చెప్పాడని, కావాలంటే, జాయింట్ గా కలిసి దీనిని అభివృద్ధి చేద్దామన్నారని పేర్కొన్నారు. భూమి ఆయనది, కన్ స్ట్రక్షన్ ఖర్చు అంతా తనది అని చెప్పారు. ఆ అవగాహన మేరకు కుంచనపల్లి అనే గ్రామంలో ఏడు ఎకరాల స్థలానికి తాము ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నామని మురళీమోహన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News