: ప్రజలు గమనిస్తున్నారు...బుద్ధి చెబుతారు: అంబటి
అనంతపురం జిల్లాకి చెందిన పయ్యావుల కేశవ్ తుళ్లూరులో భూములు కొనాల్సిన అవసరం ఏంటని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. హైదరాబాదులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కేశవ్ ప్రకటనతో తుళ్లూరులో టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అక్రమంగా భూములు కొన్నారన్న విషయం తేటతెల్లమైందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం రాజధాని పేరు చెప్పి ప్రజల నుంచి భూములు సేకరిస్తున్నప్పుడు ఆ ప్రయోజనాలు వారికి చెందకుండా టీడీపీ నేతలు అక్కడే భూములు ఎందుకు కొన్నారో చెప్పాలని ఆయన అడిగారు. నిత్యం అభద్రతా భావంతో బతుకుతున్న టీడీపీ నేతలు, తమ అవినీతి బయటకు రాగానే ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. కాపు గర్జన సందర్భంగా ముద్రగడ పద్మనాభంకి ఏ హామీలు ఇచ్చారో టీడీపీ నేతలకే తెలుసని చెప్పిన ఆయన, నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయన కాళ్లావేళ్లాపడి, ఇప్పుడు జగన్ ప్రోత్సహిస్తున్నాడని ఎదురుదాడి మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి, మాదిగజాతిని మోసం చేసిన సంగతిని ఆ సామాజిక వర్గం ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఇప్పుడు వారు మాట్లాడినా జగన్ ప్రోత్సహిస్తున్నాడనే అంటారని ఆయన మండిపడ్డారు. ప్రజలు సరైన సమయంలో వీరికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.