: తండ్రికి చికిత్స కోసం మోదీకి ఇద్దరు చిన్నారుల లేఖ... ఉచిత వైద్యానికి పీఎంఓ హామీ


కాన్పూర్ కు చెందిన పదమూడేళ్ల సుశాంత్ మిశ్రా, పదకొండేళ్ల తన్మయ్ మిశ్రా బుద్ధిగా పాఠశాలకెళుతున్నారు. కూలీగా పనిచేస్తున్న వారి తండ్రి మనోజ్ మిశ్రా... తనలాగా తన ఇద్దరు కొడుకులు కూలీలు కాకూడదన్న భావనతో బరువైనా వారిని బడి బాట పట్టించాడు. ఈ క్రమంలో మనోజ్ మిశ్రా పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడమే కష్టంగా మారిపోయింది. స్నేహితులు, బంధువులు తలా ఓ చెయ్యేశారు. అయితే ఆరోగ్యం కాస్తంత మెరుగైంది, కానీ పూర్తిగా నయం కాలేదు. మిత్రులు, బంధువులు కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఏం చేయాలా? అనుకుంటున్న తరుణంలో మనోశ్ మిశ్రాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. పూర్తి చికిత్స ఉచితంగానే అందుతుంది’’ అని శుభవార్తను పీఎంఓ అధికారులు మనోజ్ చెవిన వేశారు. దాంతో మనోజ్ కు ప్రాణం లేచి వచ్చింది. అయినా, పీఎంఓ కార్యాలయం నుంచి తనకు ఫోనెలా వచ్చిందని ఆరా తీసిన అతడు... పిల్లలను చదివించాలన్న తన బలమైన నిర్ణయమే అందుకు కారణమని తెలుసుకుని పొంగిపోయాడు. అసలు జరిగిన విషయమేంటంటే... సుశాంత్, తన్మయ్ లిద్దరూ తమ తండ్రి అనారోగ్యం, ఆర్థిక లేమిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో కుటుంబ స్థితిగతులతో పాటు తండ్రి చికిత్స కోసం బంధువులు చేసిన సహాయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ లేఖ పీఎంఓ అధికారులను కదిలించింది. వెనువెంటనే మనోజ్ కు ఫోన్ చేసి ఫ్రీ ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్లు వారితో చెప్పించింది.

  • Loading...

More Telugu News