: మోదీ నోట రాజీవ్ గాంధీ మాట!... సభ జరుగుతున్న తీరుపై ప్రధాని ఆవేదన


పార్లమెంటులో ప్రజా సమస్యలపై కాకుండా ఏదో ఒక అంశం కేంద్రంగా జరుగుతున్న రచ్చపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ వివాదం, హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తదనంతర పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మొన్న అధికార పక్షం విరుచుకుపడితే... నిన్న రాహుల్ గాంధీ ఎదురు దాడి చేశారు. నల్లధనం వెలికితీస్తామని చెప్పుకుని గద్దెనెక్కిన ప్రధాని మోదీ... ఆ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ మంత్రాన్ని పఠిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం మైకందుకున్న మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో చేసిన పలు వ్యాఖ్యలను నరేంద్ర మోదీ ప్రస్తావించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రతి ఎంపీపై గురుతర బాధ్యత ఉంటుందని రాజీవ్ గాంధీ చెప్పారని మోదీ అన్నారు. ప్రజలు మనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా? లేదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కూడా రాజీవ్ చెప్పారన్నారు. సమస్యలు పరిష్కరించే వేదికగా పార్లమెంటు ఉండాలని మోదీ ఆకాంక్షించారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలకు మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. వారి వద్ద ఎన్నో మంచి సూచనలు ఉన్నాయన్నారు. ప్రతి ఎంపీ తన భావాలను సభకు చెప్పుకునే అవకాశం ఉండాలన్నారు. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజంతా మహిళా సభ్యులే మాట్లాడేందుకు సహకరిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగిన మోదీ... కాంగ్రెస్ ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును ఆ పార్టీ ఎంపీలే తిరస్కరించడం తనకు అర్ధం కావడం లేదని కూడా మోదీ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News