: వాచీ లేని బాబూ.. మీకు ఓటేసిన రైతులకు గోచీ కూడా లేకుండా చేస్తున్నావు: రోజా
‘నాకు వాచీ లేదని చెబుతున్న చంద్రబాబు.. తనకు ఓటేసిన రైతులకు గోచీ కూడా లేకుండా చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో భూముల వ్యవహారంపై రోజా మాట్లాడారు. రెండు ఎకరాల భూముల నుంచి 2 లక్షల కోట్ల ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల హెరిటేజ్ సంస్థకు ఆయన అధిపతి ఎలా అయ్యారో కూడా ప్రజలకు చెప్పాలని, నిప్పు అని చెప్పుకుంటున్న చంద్రబాబు విచారణకు ఎందుకు సిద్ధం కాలేదు? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన బినామీలు లక్ష కోట్లు కొల్లగొట్టారని, రైతుల భూములతో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, భూములివ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని రోజా ఆరోపించారు.