: యూపీలో నిందితులపై థర్ఢ్ డిగ్రీ ప్రయోగం... ఎస్ఐ సస్పెన్షన్!
ఉత్తరప్రదేశ్ బరిచా జిల్లాలోని దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సోను(23), కాలు(24) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు రంగంలోకి దిగిన ఎస్ఐ అజిత్ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. మూత్రం తాగించడం, కరెంట్ హీటర్ పై మూత్రం పోయించడం వంటి పనులను వారితో చేయించాడు. అంతేకాకుండా, వారి మర్మావయవాలపై పెట్రోల్ కూడా పోశాడు. దీంతో నిందితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న సాయంత్రం వారిని ఇంటికి పంపించి వేశారు. అయితే, పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురైన వారి పరిస్థితి విషమంగా మారడంతో నిందితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన అధికారులు, వారిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. ఇద్దరు నిందితులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, నిందితులను చిత్రహింసలు పెట్టిన ఎస్ఐ అజిత్ వర్మను సస్పెండ్ చేశారు.