: ఆ లేఖ రాసింది ఎవరు?... ముద్రగడ లేఖపై చంద్రబాబు విస్మయం!
కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న రాసిన లేఖపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విస్మయం వ్యక్తం చేశారు. అసలు ఆ లేఖ రాసింది ఎవరు?... ముద్రగడే రాశారా?... లేక జగన్ రాశారా? అంటూ ఆయన నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత తన మంత్రివర్గ సహచరులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ జరుగుతుండగానే ముద్రగడ విశాఖలో చంద్రబాబుకు లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే చంద్రబాబు అధికారులను బయటకు పంపేసి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన లేఖపైనే ప్రధానంగా చర్చించారు. లేఖలో ముద్రగడ వాడిన భాషను కూడా చంద్రబాబు తప్పుబట్టారు. ఓ సీఎంకు ఈ భాషతోనే లేఖ రాస్తారా? అంటూ చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కేబినెట్ మంత్రులు ముద్రగడపై పోరు సాగించాలని, ఎదురు దాడికి దిగాలని ఈ సందర్భంగా చంద్రబాబు తన మంత్రి వర్గ సహచరులకు సూచించారు.