: ‘పఠాన్ కోట్’ సూత్రధారులపై చర్యల తర్వాతే చర్చలు!... పాక్ కు తేల్చిచెప్పిన భారత్
భారత్, పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఇప్పుడప్పుడే జరిగేలా లేవు. ఇరు దేశాల ప్రధానుల వరుస భేటీ, లాహోర్ లో జరిగిన పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు నేపథ్యంలో ఇక చర్చలే తరువాయి అనుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడి చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో మరోమారు ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి సంబంధించి కేసులు నమోదు చేసిన పాకిస్థాన్, కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. అంతేకాక దాడుల్లో జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పాత్ర ఉన్నట్లు తేలితే, అతడిని భారత అధికారుల విచారణకు అప్పగిస్తామని కూడా పాక్ ప్రకటించింది. ఈ ప్రకటనతో నిలిచిపోయిన చర్చలకు ఆ దేశం మళ్లీ ద్వారాలు తెరిచింది. అయితే నిన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఓ కీలక ప్రకటన చేశారు. ముందుగా పఠాన్ కోట్ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకున్న తర్వాతే పాక్ తో చర్చల విషయాన్ని పరిశీలిస్తామని ఆయన ఢిల్లీలో విస్పష్ట ప్రకటన చేశారు.