: గుజరాత్ లో ‘భూ’మాయ!... సీఎం కూతురు కంపెనీకి కారుచౌకగా 422 ఎకరాలు
గుజరాత్ లో బీజేపీ సర్కారు చిక్కుల్లో పడింది. బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కూతురు భాగస్వామిగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం కారు చౌకగా భూములను కట్టబెట్టింది. ముఖ్యమంత్రి కూతురు అనార్ పటేల్ భాగస్వామిగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం ఏకంగా 422 ఎకరాలను ప్రభుత్వ ధర కంటే 91.6 శాతం డిస్కౌంట్ ధరకు విక్రయించింది. చదరపు మీటరుకు కేవలం రూ.15 చొప్పున చెల్లించిన అనార్ పటేల్ కంపెనీ ఈ భూమిని కొనుగోలు చేసింది. 2010లో జరిగిన ఈ భూ బదలాయింపుపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ ఆసక్తికర కథనాన్ని రాసింది. అనార్ కంపెనీకి కేటాయించిన భూముల పక్కనే కొంత భూమి కోసం గోవధ నిషేధానికి కృషి చేస్తున్న ‘మురళీధర్ గోవు సేవా ట్రస్ట్’ దాఖలు చేయగా, ఆ సంస్థకు మాత్రం సర్కారీ ధరల కంటే అధిక ధరలు తీసుకున్న ప్రభుత్వం... సీఎం కూతురు కంపెనీలకు మాత్రం కారుచౌకగా కట్టబెట్టేసింది. అనార్ కంపెనీలకు చదరపు మీటరును రూ.15 కే వందలాది ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం, గోవు సంరక్షణ సంస్థకు మాత్రం చదరపు మీటరుకు రూ.671 వసూలు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకే భూకేటాయింపులు చేశామని ప్రకటించడం గమనార్హం.