: ఇండోనేసియాలో భూకంపం...సునామీ హెచ్చరికలు
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి సుమత్రా దీవులు కంపించిపోయాయి. పడాంగ్ పట్టణానికి 808 కిలో మీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో సముద్రంలో ఈ భూకంపం సంభవించిందని బీబీసీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9 గా నమోదైందని వారు వెల్లడించారు. దీంతో సునామీ సంభవించే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వారు హెచ్చరించారు. తీవ్ర స్థాయిలో దీవులు కంపించిపోవడంతో స్థానికులు పరుగులు పెట్టారు. ఇళ్లలో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే భూకంప తీవ్రతకు సంభవించిన ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.