: దేశంలో సమస్యలు పట్టించుకోరు కానీ నవాజ్ షరీఫ్ తో టీ తాగేందుకు వెళ్తారు: మోదీపై రాహుల్ సెటైర్లు
ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలోని సమస్యలు పట్టించుకునే తీరిక లేదని ఏఐసీసీ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ ఆక్షేపించారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశభక్తి గురించి గొప్పగా మాట్లాడే నరేంద్ర మోదీకి దేశంలోని సమస్యలపై స్పందించాలనే ప్రాథమిక అవగాహన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా, సరదాగా టీ తాగేందుకు 'చాయ్ పే చర్చ' పేరిట విమానం వేసుకుని పాకిస్థాన్ వెళ్లేందుకు తీరిక ఉన్న ప్రధానికి, దేశంపై శ్రద్ధ లేకపోవడం బాధాకరమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తప్పులను ఎత్తి చూపితే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారని ఆయన విమర్శించారు. జేఎన్యూలో విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్ ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేసినా, బీజేపీ మాత్రం అతను దేశద్రోహి అనే చెబుతోందని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడాలని నోరువిప్పితే వారి గొంతును నులిమేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి ఇతరులపై గౌరవం లేని పక్షంలో కనీసం ఆ పార్టీలోని సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ల మాటలైనా వినాలని, లేని పక్షంలో జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి వారి మాటలైనా వినాలని రాహుల్ సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు.