: వైఎస్సార్సీపీలో జగన్ తప్ప ఇక ఎవరూ మిగలరు: మంత్రి నారాయణ
వైఎస్సార్సీపీ లో జగన్ తప్ప చివరకు ఆ పార్టీలో ఎవరూ మిగలరని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. నవ్యాంధ్ర రాజధానిలో వేల ఎకరాల భూములు తనకు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేతకు సొంత పత్రిక ఉంది కనుక, ఆయన ఇష్టమొచ్చిన రీతిలో రాతలు రాయించారన్నారు. ఎక్కడ భూములు కొన్నామో చెబితే, పేదలకు ఆ భూములను పంచేస్తానని అన్నారు. తనకు వ్యాపారాలు ఉన్నాయని, ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, డబ్బు సంపాదించడానికి కాదని అన్నారు. తప్పుడు రాతలు రాసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఇటువంటి వార్తలు రాస్తే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిపోతారని, జగన్ సైకో అయినందువల్లే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతున్నారన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షనేతలు నానా యత్నాలు చేశారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 2019 నాటికి నవ్యాంధ్ర రాజధానిని కట్టి తీరుతామని నారాయణ స్పష్టం చేశారు.