: మీ భర్తలను ఆపండి... షారూక్, అజయ్ దేవగణ్ భార్యలకు ఢిల్లీ సర్కారు లేఖలు
నలుగురు బాలీవుడ్ హీరోల సతీమణులకు ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇంతకీ విషయం ఏంటో తెలుసా? వీరి భర్తలు వివిధ రకాల క్యాన్సర్ కారక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ, వాటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తుండటమే. షారూక్, అజయ్ దేవగణ్, గోవిందా, అర్బాజ్ ఖాన్ ల భార్యలకు ఈ మేరకు ఢిల్లీ వైద్య విభాగం లేఖలను రాసింది. "ఇది మా విన్నపం. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, మీ భర్తను పాన్ మసాలా ప్రకటనల్లో నటించకుండా చూడండి" అని షారూక్ భార్య గౌరీకి రాసిన లేఖలో ఉంది. మిగతావారికి కూడా ఇవే తరహా లేఖలు అందాయి. కాగా, గతంలో కూడా ఇలాంటి లేఖలే భారతీయుల్లో అమిత అభిమానమున్న మీ భర్తలకు రాసినప్పటికీ, స్పందన రాలేదని, అందువల్లే మరోసారి మీకు గుర్తు చేశామని, మీరైనా కల్పించుకుని వారి మనసు మార్చాలని ఈ లేఖలో ఉంది. కాగా, పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో నటిస్తున్న సన్నీలియోన్ కు గతంలో ఇదే విధమైన లేఖను ఢిల్లీ సర్కారు రాయగా, ఆమె అప్పటి నుంచి ఈ తరహా ప్రకటనలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.