: అమరావతిలో టీడీపీ నేతల భూ దందా!... లెక్కలు విప్పిన వైసీపీ నేత బొత్స


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ కీలక నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ సీనియర్ నేతలు నారాయణ, సుజనా చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మురళీమోహన్ తదితరులంతా అమరావతిలో భూములు కొన్నారని చెప్పారు. నారా లోకేశ్ 500 ఎకరాల మేర బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేశారన్నారు. కొత్త రాజధానిని అమరావతిలో కడుతున్నట్లు సెప్టెంబరులో ప్రకటిస్తే, ఆగస్టులోనే నారా లోకేశ్ భూములు కొన్నారన్నారు. సుజనా చౌదరి కూడా బినామీల పేరిటే వందలాది ఎకరాలు కొన్నారన్నారు. ఇక ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగానే కాకుండా సీఆర్డీఏ చైర్మన్ గా ఉన్న పొంగూరు నారాయణ ఏకంగా 3,129 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. ఏపీ కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావులు తమ కుటుంబ సభ్యుల పేరిట భూములు కొన్నారన్నారు. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్న ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కూడా తన జయభేరి సంస్థ పేరిట 53 ఎకరాలు కొన్నారని బొత్స ఆరోపించారు. తాము చేస్తున్న ఆరోపణలు కేవలం కల్పితాలు కాదన్న బొత్స... రిజిస్ట్రేషన్ శాఖ వద్ద నుంచి ఆధారాలు సేకరించిన తర్వాతే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను కలకలం రేపేలానే ఉన్నాయి.

  • Loading...

More Telugu News