: ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజాలు!... అరబిందో రామ్ ప్రసాద్ రెడ్డి, దివీస్ మురళికి చోటు
ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ప్రపంచ కుబేరుల జాబితాలో ఇద్దరు తెలుగు తేజాలకు కూడా చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే పేరెన్నికగన్న ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి ఈ దఫా కుబేరుల జాబితాలో స్థానం సంపాదించారు. రామ్ ప్రసాద్ రెడ్డి మొత్తం సంపదను ఫోర్బ్స్ పత్రిక 250 కోట్ల డాలర్లుగా లెక్కగట్టింది. ఈ సంపదతో ఆయనకు జాబితాలో 688వ స్థానాన్ని కట్టబెట్టింది. ఫోర్బ్స్ లోని భారతీయ కుబేరుల్లో రామ్ ప్రసాద్ రెడ్డి 25వ స్థానంలో ఉన్నారు. ఇక దివీస్ ల్యాబ్స్ అధినేత మురళి కూడా ఈ దఫా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 196 కోట్ల డాలర్ల సంపద కలిగిన మురళి ప్రపంచ కుబేరుల జాబితాలో 906వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక జాబితాలోని భారతీయ సంపన్నుల్లో ఆయన 37వ స్థానంలో నిలిచారు.