: జేఎన్యూ వీడియోలు మార్ఫింగ్ చేసినవే... తేల్చిన ఫోరెన్సిక్ విభాగం!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కొందరు విద్యార్థులు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్న వీడియోలు అసలైనవి కావని, వీటిని మార్ఫింగ్ చేశారని ఫోరెన్సిక్ అధికారులు తమ విచారణలో భాగంగా తేల్చినట్టు సమాచారం. ఈ వివాదాస్పద వీడియోలను పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగాన్ని ఆదేశించగా, హైదరాబాద్ లోని అధికారులు వాటిని విశ్లేషించారు. "ఇవి అసలైనవి కాదు. మొత్తం ఏడు వీడియోలు వస్తే, వీటిల్లో రెండింటిని ముందే ఎడిట్ చేసి వున్నారు. గొంతులు కూడా కలిపారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ సర్కారుకు నివేదిక రూపంలో అందించాం. ఈ వీడియోల్లో లేని వారి గొంతులను కలిపారు" అని ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, వర్శిటీ క్యాంపస్ లో గత నెల 9న ఈ ఘటన చోటు చేసుకోగా, 13న విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. బహిర్గతమైన వీడియోల్లో ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు కనిపించిన సంగతి తెలిసిందే.