: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేది హిల్లరీ, ట్రంప్ లే!... ‘సూపర్ ట్యూజ్ డే’ పోల్ లో వీరిదే హవా!


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్న విషయం దాదాపుగా తేలిపోయింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగడం ఖాయమైనట్లే. ‘సూపర్ ట్యూజ్ డే’ పోల్ సందర్భంగా ఆ దేశంలోని 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రైమరీల పోలింగ్ లో ఈ ఇద్దరే ముందంజలో ఉన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఇద్దరి అభ్యర్థిత్వానికే అమెరికన్లు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్లీ పోల్స్ కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి దూసుకువచ్చిన ట్రంప్ ప్రస్తుతం తన ప్రత్యర్థుల కంటే దాదాపు 30 పాయింట్లు ముందున్నారు. పార్టీ నేతల్లో ఇప్పటికే 49 శాతం మంది నేతల మద్దతును ఆయన కూడగట్టారు. ఇక హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగే అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్నారు. ఆమె తన ప్రత్యర్థుల కంటే 20 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. ‘సూపర్ ట్యూజ్ డే’ పేరిట భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ప్రారంభమైన పోలింగ్ ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలో డొనాల్డ్ తో పాటు హిల్లరీ కూడా అధ్యక్ష పోరులో ఇరు పార్టీల అభ్యర్థులుగా ఖరారు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News