: కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవడంతోనే కాంగ్రెస్ కు దరిద్రం పట్టుకుంది: వీహెచ్ కామెంట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత... రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీగా కాంగ్రెస్ ను నవ్యాంధ్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఇక తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీ కంటే, దానికోసం పోరాడిన ఉద్యమ పార్టీనే ముఖ్యమంటూ కొత్త రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు ఆశించిన ఆదరణ లభించలేదు. వెరసి రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత దుస్థితికి దిగజారింది. ఈ విపత్కర పరిస్థితికి రాష్ట్ర విభజన ఏమాత్రం కారణం కాదంటున్నారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా రికార్డులకెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడంతోనే కాంగ్రెస్ కు దరిద్రం పట్టుకుందని ఆయన నిన్న ఢిల్లీలో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వల్లే నల్లారికి సీఎం కుర్చీ దక్కిందని కూడా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎయిర్ టెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి సంబంధించి కార్తీ చిదంబరంపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన వీహెచ్... కార్తీకి నల్లారి మిత్రుడని చెప్పుకొచ్చారు.