: గర్భిణులూ...జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకండి: కేంద్ర ఆరోగ్య శాఖ సూచన
జికా వైరస్ ప్రభావిత దేశాలు లేదా ప్రాంతాలకు వెళ్ల వద్దంటూ గర్భిణులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన చేసింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. జికా వైరస్ ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించదలచుకున్న గర్భిణులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి లేదా రద్దు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ముందు గర్భిణులు ఒక్కసారి ఆలోచించాలని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పగటి సమయంలో దోమ కాటుకు గురికాకుండా చూసుకోవాలని, విదేశాల నుంచి తిరిగొచ్చిన మహిళలు రెండు వారాల్లోపు కనుక అనారోగ్యం బారిన పడితే వెంటనే సమీప ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు.