: బెలూచిస్తాన్ హోం మంత్రి కాన్వాయ్ పై కాల్పులు

పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ హోం మంత్రి మీర్ సర్ఫరాజ్ అహ్మద్ కాన్వాయ్ పై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సుయ్ అనే ప్రాంతానికి ఆయన వెళ్తుండగా దేరా బుగ్టి ప్రాంతం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి సెక్యూరిటీ సిబ్బంది దుండగులపై తిరిగి కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంత్రి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, గతంలో కూడా ఆయనను హత మార్చేందుకు దుండగులు విఫలయత్నం చేశారు.