: ఇబ్బందికర ప్రశ్నలు... డేటింగ్ కు రమ్మని వేధింపులు: ప్రతి ముగ్గురు మహిళా ఉద్యోగుల్లో ఒకరు బాధితులే!
ఆఫీసుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కుంటున్న వేధింపులు ఎలా ఉంటున్నాయి? ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుని అడ్డుకట్ట వేయాలని భావించిన జపాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి ఓ సర్వే జరిపించింది. దాదాపు పది వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొని జపాన్ సర్కారు అధ్యయనానికి సహకరించారు. ఈ స్టడీ వివరాలు నేడు విడుదల కాగా, ప్రతి ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. మహిళల వయసు, బాహ్య సౌందర్యం వేధింపులకు కారణాలని తెలుస్తోంది. తమను అవాంఛితంగా కౌగిలించుకుంటున్నారని 40 శాతం మంది వెల్లడించగా, లైంగిక సంబంధ ప్రశ్నలను అడుగుతుంటారని 38 శాతం మంది, డేటింగ్ కు రమ్మని పిలుస్తుంటారని 27 శాతం మంది ఉద్యోగినులు చెప్పారు. తాము బలవంతంగా పరాయి పురుషులతో సంబంధాలు కొనసాగిస్తున్నామని వెల్లడించిన వారూ ఉన్నారు. ఇక ఈ తరహా ప్రవర్తనను పురుషులు తక్షణం మార్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జపాన్ సర్కారు హెచ్చరిస్తోంది.