: కర్నూలు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం... వాట్ నెక్ట్స్? అందరి చూపూ వైసీపీపైనే!


వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. జగన్ సహా పార్టీలోని ప్రధాన నేతలు ఎందరు అడ్డుకుంటున్నా వలసలు ఆగడం లేదు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియలతో మొదలైన ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి నేడు టీడీపీలోకి జంప్ కొట్టారు. భూమా కుటుంబం తరువాత కృష్ణా జిల్లాకు చెందిన జలీల్ ఖాన్, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన డేవిడ్ రాజు సహా ఇప్పటివరకూ ఏడుగురు ఎమ్మెల్యేలు వైకాపాలోకి చేరిపోయారు. వీరంతా చెబుతున్నది ఒకటే మాట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నామని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరమూ శ్రమిస్తున్నారని, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు పార్టీ మారుతున్నామని స్పష్టం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి పార్టీ అధినేత జగన్ వైఖరే, ఫిరాయింపులకు కారణమని ఆరోపిస్తున్న నేతలు కూడా ఉన్నారు. ఇక కర్నూలు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎమ్మెల్యేలు వలసబాట పట్టారు. తదుపరి ఏ జిల్లా నేత జగన్ కు హ్యాండిస్తాడో వేచి చూడాలి. ఇదిలావుండగా, కనీసం మరో 8 నుంచి 10 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. నిన్న జగన్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తే, 10 మంది హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వీరిలో ఎంతమంది టీడీపీలోకి దూకుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఐదు జిల్లాలను తాకిన 'ఆపరేషన్ ఆకర్ష్' తదుపరి ఏ జిల్లాను తాకుతుందోనని అటు తెలుగుదేశం, ఇటు వైకాపా కార్యకర్తలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News