: అక్బరుద్దీన్ బాటలో అమానతుల్లా ఖాన్...మోదీ సర్కారుపై ఆప్ ఎమ్మెల్యే ‘హేట్ స్పీచ్’
గడచిన సార్వత్రిక ఎన్నికల ముందు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏకంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ‘హేట్ స్పీచ్’గా పెద్ద దుమారమే లేపిన అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో దేశంలో ఎక్కడికెళ్లినా ఆయనకు నిరసనలు తప్పలేదు. తాజాగా ఢిల్లీలో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ వంతు వచ్చింది. గత నెల 16న ఢిల్లీలోని తన సొంత నియోజకవర్గం ఓక్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మత గురువు మౌలానా ముఫ్తీ అబ్దుస్ సమీ ఖాస్మీ అరెస్ట్ ను నిరసిస్తూ ముస్లిం యువతతో సమావేశం నిర్వహించిన అమానతుల్లా ఖాన్... మోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంటి ముందు ధర్నా నిర్వహించాలని, మంత్రిని ఘెరావ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమానతుల్లా ఖాన్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కలకలం రేపుతోంది. ‘‘హోం మంత్రి ఇంటిని ఘెరావ్ చేయాలని నిర్ణయించుకుంటే... ఢిల్లీలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. మీరు ఆందోళన ప్రారంభిస్తే, ప్రభుత్వం మీ పిల్లలను టచ్ చేసే ధైర్యం చేయబోదు. ఈ విషయంలో నాది హామీ. ముఫ్తీ సమికి సంబంధించి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. యువతను జాతి వ్యతిరేక దళాల్లోకి ముఫ్తీ చేరుస్తున్నారని నాకు పోలీసులు చెప్పారు. ఈ తరహా వాతావరణాన్ని వారే సృష్టిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాల్సి ఉంది. సమీ విడుదల కోసం ఆందోళన చేపట్టేందుకు త్వరలోనే నా నుంచి మీకు పిలుపు వస్తుంది’’ అంటూ అమానతుల్లా ఖాన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.