: కొత్త, పాతకు సమ న్యాయం!...‘ఆకర్ష్’కు సహకరించాలని నేతలకు చంద్రబాబు పిలుపు
విజయవాడలో నేటి ఉదయం ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. కేంద్ర బడ్జెట్ పై నిరసన గళం విప్పుతూనే రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా సాధనకు బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో నానా రభస చేస్తున్న విపక్షానికి ‘ఆకర్ష్’ పేరిట భారీ షాకులిస్తున్న ఆయన మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు పరోక్షంగా చెప్పారు. పార్టీలోకి చేరుతున్న ఇతర పార్టీల నేతలకు సంబంధించి... టీడీపీ నేతలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. కొత్త నేతలతో పాటు పాత కాపులకు కూడా సముచిత ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు... వలసలకు అడ్డు చెప్పకుండా, కొత్తవారికి స్వాగతం పలకాలని ఉద్బోధించారు. తద్వారా ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసే కార్యక్రమానికి అందరూ సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.