: చేతికి పెట్టుకున్న వాచీ మెడకు చుట్టుకుంది!... కర్ణాటక సీఎంకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు
తెల్లటి పంచె, అదే రంగులో చొక్కా, భుజాన ఓ చేతి రుమాలు... సాధారణ వ్యక్తిలా దర్శనమిచ్చే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతికి మాత్రం ఖరీదైన వాచీ కనిపించింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన చేతి నుంచి మాయమైన సదరు వాచీ ఖరీదు అక్షరాలా రూ.70 లక్షలట. అధికారానికి చాలాకాలంగా దూరంగా ఉన్న జేడీఎస్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కన్ను ఆ వాచీపై పడింది. ఇంకేముంది, మొన్న జరిగిన జిల్లా, పంచాయతీల ఎన్నికలు, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి ఘాటు విమర్శలు చేశారు. సాధారణంగా కనిపించే వ్యక్తికి అంతటి ఖరీదైన వాచీ ఎలా వచ్చిందంటూ ఆరోపణలు ప్రారంభించిన ఆయన ఏకంగా దొంగతనానికి గురైన వాచీ సిద్ధూ చేతికి చేరిందని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో విమర్శల జడివానలో తడిసిముద్దైన ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా చూసింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన ... జిల్లా, పంచాయతీల ఎన్నికల ఫలితాలపై మాట్లాడే నెపంతో ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ నూ కలిశారు. తన మిత్రుడు సదరు వాచీని బహూకరించారని, అయితే విషయాన్ని పక్కదారి పట్టించిన కుమారస్వామి తనపై అకారణంగా నిందలేస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆయన వివరణతో అధిష్ఠానం సంతృప్తి చెందలేదట. ఆ వాచీపై సమగ్ర నివేదికను అందజేయాలని కన్నడ నేతలను కోరిందని సమాచారం. ఈ మేరకు కేపీసీసీ పెద్దలు ఇప్పటికే నివేదిక తయారీలో తలమునకలయ్యారు. ఈ క్రమంలో అధిష్ఠానం నుంచి సిద్ధరామయ్యకు పిలుపు రానే వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే హస్తిన రావాలన్న అధిష్ఠానం పిలుపుతో ఆయన క్షణమొక యుగంలా కాలం గడుపుతున్నారు. ఏదో ఫ్రెండు ఇచ్చాడు కదా అని చేతికి పెట్టుకున్న ఆ వాచీ తన మెడకు చుట్టుకుందని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.