: బ్లడ్ ప్రజర్ గురించి అపోహలు... వాటి వెనుక నిజాలు!
బ్లడ్ ప్రజర్... దీన్నే రక్తపోటు అని, హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. గుండె, మెదడు, మూత్రపిండాలు తదితర శరీర అవయవాల పనితీరుపై పెను ప్రభావాన్ని చూపే రక్తపోటు గురించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. సాధారణంగా 120/80 ఎంఎం హెచ్జీ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉన్నట్టు. అంతకు పెరిగితే, హై బీపీ, తగ్గితే లోబీపీ అంటారన్నది తెలిసిందే. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్ వంటిది. ఈ నేపథ్యంలో రక్తపోటు గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాటి గురించిన నిజాలు... అపోహ: మహిళలకు హై బీపీ ఎక్కువగా రాదు. వాస్తవం: ఇది పూర్తిగా అబద్ధం. ఇండియాకు సంబంధించినంత వరకూ 25 ఏళ్లు నిండిన పురుషుల్లో 23.1 శాతం మంది, మహిళల్లో 22.6 శాతం మంది హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు. బీపీకి లింగబేధాలేమీ ఉండవు. అపోహ: ఔషధాలు వాడితే రక్తపోటు నయమవుతుంది వాస్తవం: రక్తపోటు జీవితకాల వ్యాధి. మెడికేషన్ కేవలం రక్తపోటును నియంత్రించగలుగుతుంది. ప్రతిరోజూ నియమిత ఎక్సర్ సైజులు చేస్తూ, ఔషధాలు వాడుతూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోగలుగుతారు. అపోహ: ఉప్పును ఎక్కువగా తినను కాబట్టి నాకు బీపీ రాదు. వాస్తవం: ఉప్పు వాడటం లేదని రక్తపోటు రాదనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీరు తినే ఇతర ఆహార పదార్థాల్లో కూడా ఉప్పు ఉంటుంది. బేకరీ ఫుడ్స్ నుంచి ఎన్నో రకాల ఆహారం ఉప్పును కలిగివుంటుంది. శరీరంలో సాల్ట్ శాతం పెరుగుతుంటే బీపీ బారినపడే అవకాశాలు పెరుగుతాయి. అపోహ: గతంలో బీపీ వచ్చి తగ్గింది. ఇక రాదు! వాస్తవం: ఇది కూడా అవాస్తవమే. ఒకసారి బీపీ లేనంత మాత్రాన మళ్లీ రాదన్న గ్యారెంటీ ఎంతమాత్రమూ లేదు. అపోహ: హై రిస్క్ క్యాటగిరీలో ఉంటే బీపీ రాకుండా తప్పించుకోలేము. వాస్తవం: మీ కుటుంబంలోని అత్యధికుల్లో బీపీ ఉన్నప్పటికీ, కొన్ని ముందుజాగ్రత్త చర్యలతో మీకు బీపీ రాకుండా చూసుకోవచ్చు.