: టీడీపీ భేటీకి భూమా రీ ఎంట్రీ... తొలిసారి అడుగుపెట్టిన అఖిలప్రియ


టీడీపీ పాత కాపు... భూమా నాగిరెడ్డి చాలాకాలం తర్వాత తన సొంత పార్టీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ పై విజయం సాధించిన ఆయన ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురుతో కలిసి ఇటీవలే సొంత గూటికి చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి... గతంలో జిల్లా రాజకీయాల్లో భాగంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో ఉన్న విభేదాల కారణంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. వైసీపీ నుంచే జిల్లాలో రెండు ఎమ్మెల్యే టికెట్లను సాధించి సత్తా చాటిన భూమా.. రెండు చోట్లా విజయం సాధించారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా జగన్ కు ఝలకిచ్చిన భూమా కూతురుతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన కూతురు అఖిలప్రియతో కలిసి వచ్చారు. వచ్చీ రాగానే ఆయన పార్టీలోని తన పాత స్నేహితులతో కరచాలనం, ఆలింగనాల్లో మునిగిపోయారు. చాలాకాలం తర్వాత పార్టీ సమావేశానికి వచ్చిన భూమాను టీడీపీ నేతలు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News