: రోడ్డుపై బైఠాయించిన చక్రి తల్లి, సోదరుడు, కల్పించుకున్న హోం మంత్రి నాయిని
హైదరాబాద్, సోమాజిగూడలోని 'వరుణ్ స్వర్గం విల్లా' ఎదుట దివంగత సంగీత దర్శకుడు చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ ధర్నాకు దిగడంతో, ఈ ప్రాంతంలో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తమ ఇంట్లో అద్దెకు ఉన్నవారు ఇల్లు ఖాళీ చేయడం లేదన్నది వీరి ప్రధాన ఆరోపణ. గత 8 నెలలుగా అద్దె ఇవ్వకుండా ఇంట్లో ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారు తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఈ సందర్భంగా విద్యావతి డిమాండ్ చేశారు. తమ ఇంటిని తమకు అప్పగించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కాగా, విషయం తెలుసుకున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చక్రి సోదరుడు మహిత్ నారాయణతో ఫోన్లో మాట్లాడారు. చక్రితో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, మహిత్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.