: పాత ఫోన్ అమ్ముతున్నారా? ఇలా చేస్తే మంచి ధర పలికే అవకాశం!


రోజుకు ఓ వెరైటీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తున్న వేళ, సెకండ్ హ్యాండ్ ఫోన్ల అమ్మకాలూ గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త ఫోన్లు కొనాలని భావిస్తున్న వారు, తాము వాడేసిన ఫోన్ ను ఎవరికైనా విక్రయించాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారి కోసం ఈబే, ఫ్లిక్కర్, ఓఎల్ఎక్స్ వంటి ఆన్ లైన్ మార్కెట్ వెబ్ సైట్లతో పాటు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలూ సిద్ధంగా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ వంటి సంస్థలకు కూడా వాటిని విక్రయించవచ్చు. అయితే, ఫోన్ కు మంచి ధర రావాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. * ఫోన్ స్క్రీన్ పై ఎలాంటి పగుళ్లూ లేకుండా చూసుకోవాలి. ఓ చిన్న పగులు కనిపించినా దానికి ధర పలకదు. విక్రయించేందుకు ఫోన్ ఉంచే ముందు స్క్రీన్ బాగా కనిపించేలా చూడాలి. * ఎప్పుడు ఫోన్ కొనుగోలు చేసినా, దానితో పాటు వచ్చే బాక్స్, ఇతర యాక్సెసరీలు దాచి ఉంచితే మంచిది. ఫోన్ విక్రయించాలని భావిస్తే, బాక్స్ సహా అని చెప్పగలిగితే, మరింత డిమాండ్ చేయవచ్చు. * సామాజిక మాధ్యమాల్లో, ఈ-కామర్స్ సైట్లలో ఉంచే ఫోన్ చిత్రాలను స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. కొనేవారు వీటిని చూడగానే, ఫోన్ మంచి కండిషన్లో ఉందని నమ్మగలగాలి. * మీ ఫోన్ మంచి కండిషన్లో ఉందని మీరు భావించకుంటే, ఒకటి కన్నా ఎక్కువగా సైట్లలో ఫోన్ గురించిన సమాచారం వెల్లడిస్తూ, విక్రయానికి ఉంచడం వల్ల బెస్ట్ ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు అధికం. * ఇక చివరిగా, మీరు ఫోన్ విక్రయిస్తున్న సిరీస్ లో కొత్త మోడల్ రాకముందే అమ్మేస్తే మంచిది. కొత్త మోడల్ వచ్చిందంటే, దాన్ని కొనుగోలు చేయాలని భావించే వారే అధికంగా ఉంటారు. పైగా కొత్త ఫోన్ విడుదల కాగానే, పాత మోడల్స్ ధరలను కంపెనీలే తగ్గిస్తుంటాయి కూడా.

  • Loading...

More Telugu News