: పరీక్ష రాసేందుకు వెళితే, బట్టలు విప్పించి కూర్చోబెట్టిన ఆర్మీ అధికారులు!
వారంతా యువకులు. సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వారు. వీరందరూ బీహార్ లోని ముజఫరాపూర్ లో రాత పరీక్షకు హాజరైన వేళ, అధికారులు బట్టలు తీసేసి అండర్ వేర్ పై కూర్చుని పరీక్షలు రాయాలని ఆదేశించారు. దాదాపు 11 వేల మంది ఉద్యోగార్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. సైనిక ఉద్యోగాల నియామకపు పరీక్షలకు వీరు హాజరు కాగా, గతానుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, ఎండలో దుస్తులు విప్పించి కూర్చోబెట్టడం విమర్శలకు దారితీసింది. ఇంతకీ విషయం ఏమంటే, పరీక్షల వేళ, బీహార్ లో జరిగేది ఏంటో తెలుసుగా? విద్యార్థులు కాపీ కొట్టడం, చూసి రాయడం, పుస్తకాలు పక్కన పెట్టుకుని పరీక్షలకు రావడం, విద్యార్థుల తల్లిదండ్రులు, సోదరులు భవనాల గోడలు, కిటికీలు ఎక్కి స్లిప్పులు అందించడం, ఆపై ఎన్నో ప్రమాదాలు జరగడం వంటి ఘటనలను నివారించేందుకే సైన్యాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. గతంలో పరీక్షలు నిర్వహించిన సమయంలో ఎదురైన కొన్ని అనుభవాలు, దురదృష్టకర సంఘటనలను నివారించేందుకే ఇలా చేశామని ఓ అధికారి చెప్పడం గమనార్హం.