: ఆమె ట్వీటుకు కదిలిన రైల్వే శాఖ!


ఓ చిన్న ట్వీటుకు రైల్వే శాఖ దిగొచ్చింది. తనకు ఓ రైల్వే స్టేషనులో గరిష్ఠ చిల్లర ధర కన్నా అధికంగా వస్తువులు అంటగట్టాలని చూస్తున్నారంటూ స్వాతీ కుమారి అనే 20 ఏళ్ల యువతి ట్వీట్ చేస్తే అధికారులు మెరుపు వేగంతో స్పందించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, స్వాతి గత వారంలో అజీమా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించింది. ఆగ్రాలో ఆమె ఎక్కగా, కాన్పూర్ వెళ్లే సరికి మంచినీరు అవసరమై, ఓ బాటిల్ కొనుగోలు చేయాలని భావించింది. ఐఆర్సీటీసీ 'రైల్ నీర్' పేరిట అమ్ముతున్న సీసా ధర రూ. 15 కాగా, రైల్లో అమ్మే దళారి రూ. 20 చెప్పాడు. ఈ విషయాన్ని స్వాతి రైల్వే శాఖ ట్విట్టర్ ఖాతాకు వెల్లడించింది. ఆ వెంటనే ఆమె పీఎన్ఆర్ సంఖ్యను అడిగిన అధికారులు, అలహాబాద్ లో ఆమె ప్రయాణిస్తున్న బోగీ వద్దకు వచ్చి రూ. 15కే నీళ్లిచ్చారు. ప్రయాణికుల నుంచి అక్రమంగా దోచుకుంటున్న కాంట్రాక్టర్ పై వేటేశారు. ఐదు రూపాయలే కదాని ఉపేక్షించకుండా, స్వాతి చేసిన పనిని మిగతా ప్రయాణికులంతా మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News