: చిదంబరం దిగినా పనికాలేదు!... జగన్ కేసులో దాల్మియా పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి నిన్న దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాల్మియా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై దాల్మియా తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వకాల్తా పుచ్చుకున్నారు. చెన్నైకి చెందిన దాల్మియా విజ్ఞప్తిని కాదనలేకపోయిన చిదంబరం చాలాకాలం తర్వాత నల్లకోటు వేసుకుని కోర్టులో వాదనలు వినిపించిన విషయమూ విదితమే. వాదనలన్నీ విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ నిన్న తుది తీర్పు వెలువరించారు. చిదంబరం వాదనతో ఏకీభవించని న్యాయమూర్తి... దాల్మియా పిటిషన్లను కొట్టేశారు. దీంతో ఈడీ ముందు దాల్మియా తదితరులు హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది.