: కృష్ణా తీరాన నిర్మించిన ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాలి: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల
కోర్టు ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు ప్రస్తుతం కృష్ణా తీరాన ఉంటున్న నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. రూ.70 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఆ ఇంటిని నిర్మించారని, కనీసం పన్ను కూడా కట్టడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులకు తాను పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే తాను కోర్టుకు వెళ్లానని, స్పందించిన కోర్టు కృష్ణా తీరాన నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదల ఇళ్లు ఆక్రమించారని ఆళ్ల ఆరోపించారు. తాను నిప్పు అని చెప్పుకుంటున్న చంద్రబాబు, అక్రమంగా నిర్మించిన నివాసంలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు.