: రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్నదే మా లక్ష్యం: జైట్లీ
2016-17 బడ్జెట్ లో రైతులు, వ్యవసాయ అభివృద్ధికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాలు ప్రకటించారు. రైతులే దేశానికి వెన్నెముకని, ముఖ్యంగా ఆహార భద్రతలో వారే కీలకమని పేర్కొన్నారు. వారికి ఆదాయ భద్రత కల్పిస్తామని, 2022 నాటికి వారి ఆదాయం రెట్టింపు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.35,984 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఉత్పాదకత పెంచేందుకు 28.5 లక్షల హెక్టార్లకు అదనంగా నీటిపారుదల కల్పిస్తామని, వచ్చే ఏడాదికి దానికోసం 17వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. ప్రత్యేకంగా నాబార్డులో రూ.20వేల కోట్లతో నీటిపారుదల కోసం ఓ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా 5 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేస్తామని, సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కోసం రూ.368 కోట్లు కేటాయిస్తున్నామని వివరించారు. ఈ-మార్కెట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామని, రైతుల రుణాల మీద వడ్డీ చెల్లింపుకు రూ.15వేల కోట్లు, గ్రామీణ రహదారుల కోసం రూ.19వేల కోట్లు, పశుగణాభివృద్ధికి కొత్తగా 4 ప్రాజెక్టులు, పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500 కోట్లు, ఏకీకృత వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం రూ.5500 కోట్లు, వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.9 లక్షల కోట్లు, రూ.60వేల కోట్ల భూగర్భ జలాల వృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.