: ధోనీ ఆట కోసం పాక్ అభిమాని గుండె కొట్టుకుందట!


మొన్నటికి మొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానినంటూ, అత్యుత్సాహంతో తన ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసిన పాకిస్థానీ యువకుడు జైలుకెళ్లి, ఇప్పుడే బెయిలు పొందాడు. ఇంతలోనే టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటను చూసేందుకు తన గుండె కొట్టుకుంటోందంటూ మరో పాకిస్థానీ ప్రకటించాడు. పాక్ ను కాస్తంత ఇబ్బందికి గురి చేసేలా ఈ ప్రకటన చేయడంతోనే ఆగని ఆ క్రికెట్ లవర్... మొన్నటి ‘దాయాదీ’ పోరును కళ్లారా వీక్షించేందుకు ఏకంగా అమెరికా నుంచి బంగ్లాదేశ్ కు వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చాడు. అది కూడా ఆరు పదుల వయసులో, సుదీర్ఘ ప్రయాణాలకు సహకరించని అనారోగ్యంతో ఉన్నా ఆయన ఆగలేకపోయాడు. అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డ మొహమ్మద్ బషీర్... కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ఇక పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ ఆటను ఆయన చూడకుండా ఉండలేడు. ఆసియా కప్ లో భాగంగా మొన్న భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు బషీర్ హాజరయ్యాడు. స్టాండ్స్ లో కూర్చుని ఇరు జట్ల ఆటగాళ్లకు మద్దతు పలుకుతూ కేరింతలు కొట్టాడు. ఇక మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ లో ఉండగా, స్టాండ్స్ లోని బషీర్ ను చూసి గుర్తు పట్టిన మన కెప్టెన్ కూల్ చేయి ఊపి మరీ బషీర్ లో ఉత్సాహం నింపాడట. ఇక మ్యాచ్ చూసిన తర్వాత బషీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వారం క్రితం స్వల్పంగా మరోసారి గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లు ప్రయాణం చేయవద్దని వారించారు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ లో ధోనీ ఆటను చూడకుండా ఆగలేకపోయాను. వెంటనే విమానం ఎక్కి ఇక్కడ వాలాను’’ అని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News