: రాణించిన షబ్బీర్ రహమాన్...శ్రీలంక లక్ష్యం 148
ఆసియా కప్ లో భాగంగా ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక విజయ లక్ష్యం 148 పరుగులు. అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరంభంలోనే మాథ్యూస్, కులశేఖర ధాటికి రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 26 పరుగుల వద్ద ముష్ఫికర్ రహీమ్ (4) రన్ అవుట్ గా వెనుదిరగడంతో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. అయితే, షబ్బీర్ రహమాన్ (80), షకిబ్ అల్ హసన్ (32) జట్టును ఆదుకున్నారు. రహమాన్ శివాలెత్తి ఆడాడు. 54 బంతుల్లో 80 పరుగులు సాధించి, జట్టు భారీ స్కోరు చేసేందుకు బాటలు వేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మదుల్లా (23) నాటౌట్ గా నిలవగా, నరుల్ హాసన్ (2), ముషారఫ్ మొర్తజా (2) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమీర మూడు వికెట్లతో రాణించగా, మాథ్యూస్, కులశేఖర చెరో వికెట్ తీసి చక్కని సహకారమందించారు. 148 పరుగుల విజయలక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది.