: రాబోవు తరాలకు శ్రీరామచంద్రుడతడే!: మోహన్ బాబు
రాబోవు తరాలకు నందమూరి తారకరామారావు ఫోటో చూపించి 'శ్రీరామచంద్రుడంటే ఇతనే' అంటే నమ్ముతారని సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. 'ఏకగర్భమందు జన్మించకపోయినా మోహన్ బాబు, నేను సొదరులం' అని ఎన్టీఆర్ అన్నారని మోహన్ బాబు గర్వంగా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాల నుంచి తెల్లని వస్త్రాలు ధరించడం మొదలైంది తన అసెంబ్లీ రౌడీ సినిమా ఫంక్షన్ నుంచేనని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ తన సినిమా మేజర్ చంద్రకాంత్ లో చివరిసారి నటించారని మోహన్ బాబు గుర్తు చేశారు. తన గురించి ఎన్టీఆర్ కు ఎవరైనా ఏదయినా చెబితే, ఆయన వినేవారు కాదని, చెప్పుడు మాటలను ఆయన ఏనాడు వినేలేదని మోహన్ బాబు అన్నారు. ఎన్టీఆర్ మహోన్నతుడు, మహాపురుషుడు అని, ఆయనకు జన్మించిన వ్యక్తి బాలయ్య అని మోహన్ బాబు ఆయనను పొగిడారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండగా, లేపాక్షిని చారిత్రాత్మక ప్రదేశంగా ప్రపంచ వ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన ఏకైక ఎమ్మెల్యే బాలయ్య అని ఆయన అభినందించారు. అలాగే 'ఈ కార్యక్రమ నిర్వహణకు హ్యాట్సాఫ్' అని మోహన్ బాబు బాలయ్యకు కితాబునిచ్చారు.