: వారిని అప్పుడే పట్టుకున్నాం... విచారణ ఆలస్యమైంది: 'వీణవంక' ఘటనపై డీఎస్పీ రవీందర్


కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనపై డీఎస్పీ రవీందర్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో నిందితులు అంజయ్య, శ్రీనివాస్, రాకేశ్ లను వెంటనే అదుపులోకి తీసుకున్నామని అన్నారు. పూర్తి స్థాయి విచారణలో జరిగిన జాప్యం కారణంగా వారిని మీడియా ముందుకు తీసుకురావడం ఆలస్యమైందని ఆయన చెప్పారు. బంధువుల ఇంటికి వెళ్తున్న యువతిని అటకాయించి, గుట్టల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ సందర్భంగా వీడియో కూడా తీశారని ఆయన తెలిపారు. మరుసటి రోజు ఆ యువతి బంధువుల ఇంటికి వెళ్లిందని ఆయన చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులకు జరిగింది వివరించిందని, అయితే యువతి తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారని ఆయన వెల్లడించారు. ఆ తరువాత నిందితుల్లో అంజయ్య మరోసారి ఆమెను అనుభవించాలని భావించి బెదిరించాడని అన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు బంధువులు, గ్రామస్థులు, నిందితుల కుటుంబ సభ్యులతో కలిసి వలవేసి, వారిని పట్టుకుని చితకబాదారని ఆయన తెలిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చామని ఆయన వెల్లడించారు. అప్పుడే బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసిందని, దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన వివరించారు. నిందితులను అప్పుడే అదుపులోకి తీసుకున్నప్పటికీ విచారణలో జాప్యం కారణంగా వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టలేదని ఆయన తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లని ఆయన వెల్లడించారు. వారిపై మూడు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News