: తమ్ముడు తలవంచిన చోటే నివాళులర్పించిన అక్క!
నెల్లూరు జిల్లా గాంధీజనసంఘంలో జన్మించిన మల్లిమస్తాన్ బాబు, ఆండీస్ పర్వతాలను అధిరోహించి, కిందికి దిగి వస్తుండగా అసువులు బాసిన సంగతి తెలిసిందే. దీంతో తమ్ముడు ఎక్కడైతే ప్రాణాలు విడిచాడో, సరిగ్గా అదే ప్రాంతంలో అతనికి నివాళులర్పించాలని భావించిన అతని సోదరి దొరసానమ్మ, ఏడాది తిరగకుండానే ఆండీస్ పర్వతాలు అధిరోహించి, అక్కడే తమ్ముడికి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తమ్ముడు మౌంటెనీరింగ్ ను ఓ ఆటగా భావించేవాడని చెప్పింది. పర్వతారోహణకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది కానీ, ఎవరెస్టు లాంటి అత్యున్నత శిఖరం చెంతనే ఉన్న భారత్ లో మాత్రం ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేసేవాడని చెప్పింది. 'అక్కా నువ్వు కూడా రా'...అని పిలిచేవాడని దొరసానమ్మ తెలిపింది. అందుకే వాడి కోరిక నెరవేర్చాలని భావించి ఆండీస్ పర్వతం అధిరోహించానని ఆమె చెప్పింది. తన తమ్ముడి పార్థివదేహం చూసినప్పుడు తనకు కన్నీళ్లు రాలేదు కానీ, సర్వం కోల్పోయిన బాధ మాత్రం కలిగిందని ఆమె తెలిపింది. అందుకే వాడికి నివాళిగా ఆండీస్ పర్వతాన్ని అధిరోహించానని ఆమె చెప్పింది.