: బంగారానికి ఏమైంది? ఎందుకు పెరుగుతోంది?
రెండు వారాల క్రితం బంగారం పట్టుకుంటే చేతికి చిక్కలేదు. 10 గ్రాములు ధర 29వేలకు పైగా ఉన్న బంగారం టపటప మంటూ జారుతూ 25వేలకు వచ్చి పడ్డది. అదే సమయంలో బంగారం 22వేలకు అంతకంటే దిగువకూ పడిపోయే ప్రమాదముందని కొందరు విశ్లేషణ వ్యక్తీకరించారు. 25వేలను తాకిన బంగారం నెమ్మదిగా పుంజుకుంటూ వారంలోనే మళ్లీ 28వేలకు ఎగసింది.
వాస్తవానికి బంగారం తగ్గితే కొందామని ఎంతో మంది మధ్య తరగతి, సామాన్యులు ఎదురు చూస్తున్నారు. కొందరు భలే మంచి చౌక బేరమూ... అని ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయగా, మరికొందరు మాత్రం ఇంకా తగ్గుతుందన్న ఆశతో వేచి ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు బంగారం ధర మళ్లీ పైకి పోతుంటే అయ్యో చాన్స్ మిస్సయ్యామే అనుకుంటున్నారు.
బంగారం ధర తగ్గడానికి ఏవైతే కారణాలు దోహదం చేశాయో అవన్నీ పుకార్లే. వాస్తవానికి బంగారానికి డిమాండ్ తగ్గలేదంటున్నారు. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, తమ ఖజానాలను బంగారంతో నింపేస్తున్నాయని చెబుతున్నారు.
రష్యా, కజకస్తాన్ దేశాల బంగారం నిల్వలు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అలాగే బంగారం ధరలు తగ్గడంతో దీర్గకాలిక పెట్టుబడిదారులు పసిడి కొనుగోలుకు ముందుకు వచ్చారని ఆడ్రియన్ డే అస్సెట్ మేనేజ్ మెంట్ ప్రెసిడెంట్ ఆడ్రియన్ చెప్పారు.
వచ్చే వారం కూడా బంగారం ధర పెరుగుతుందని 15 మంది విశ్లేషకులు బ్లూంబర్గ్ నిర్వహించిన సర్వేలో అభిప్రాయం తెలిపారు. 11 మంది విశ్లేషకులు మాత్రం తగ్గుతుందని చెప్పారు. అమెరికాలో చిన్న నాణేల కోసం డిమాండ్ రెట్టింపు కావడంతో ఈ ఒత్తిడి తట్టుకోలేక వీటి విక్రయాలపై అక్కడి మింట్ ఈ నెల 23న నిషేధాన్ని విధించింది.
మన దగ్గర కూడా ధర తగ్గడంతో ఆభరణాల కోసమే కాకుండా, బిస్కెట్లు, నాణేలా రూపంలో కొని దాచుకోవడానికి గత రెండు వారాల వ్యవధిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. నేరుగా బంగారం(స్పెక్యేలుషన్ కాకుండా) కొనుగోళ్ల డిమాండ్ గతంలోని గరిష్ఠ స్థాయిని మించిందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వెల్డడించింది. మొత్తానికి పలువురు విశ్లేషకులు, డీలర్లు మాత్రం బంగారం మొన్నటి కనిష్ట స్థాయి అయిన 25వేల కంటే తక్కువకు ఇప్పట్లో పడిపోదని అంటున్నారు. అలా అని పెద్దగా పెరగడానికి కూడా అవకాశాల్లేవంటున్నారు. పరిమితంగా పెరగవచ్చని, ఆ తర్వాత కొంత దిగిరావచ్చని చెబుతున్నారు.