: సౌత్ కరోలినాలో తిరుగులేని హిల్లరీ క్లింటన్

అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ పడాలని భావిస్తున్న హిల్లరీ క్లింటన్, తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశారు. శనివారం నాడు జరిగిన సౌత్ కరోలినా ప్రైమరీ పోలింగ్ లో ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ ను ఆమె వెనక్కు నెట్టేశారు. వారం రోజుల వ్యవధిలో హిల్లరీకి ఇది రెండో విజయం. ఆపై యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో ఆమె మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ పై సూటి విమర్శలు చేశారు. అమెరికా ఇప్పటికే గొప్ప దేశమని, దాన్ని మరోసారి గొప్పగా నిలబెట్టడమేంటని అన్నారు. అమెరికా ఎన్నడూ తల దించుకోలేదని, ప్రజల మధ్య గోడలు కట్టడం ఆపేసి, అడ్డంకులు తొలగించే పని మొదలు పెట్టాలని ట్రంప్ కు సలహా ఇచ్చారు. కాగా, ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ అమెరికన్లు అధికంగా ఉండటం, వారిలో 84 శాతం మంది హిల్లరీకి మద్దతిస్తుండటంతో, ఆమె విజయం సునాయాసమైందని పత్రికలు వ్యాఖ్యానించాయి.