: మహాభారతంలో హింస కంటే విజయవాడలో జరిగిన హింసే ఎక్కువ: రాంగోపాల్ వర్మ
మహా భారతంలో జరిగిన హింస కంటే విజయవాడలో జరిగిన హింసే ఎక్కువని ‘వంగవీటి’ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘దేవుడంటే నాకు భయం లేదు. నేనే ఒక దేవుడిని’, ‘యముడు నా గొంతుపై కత్తి పెట్టినా అన్నమయ్య వంటి సినిమా తీయలేను’, ‘నా సినిమాల్లో హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకే ఎక్కువ ఖర్చు పెడతాను’ అంటూ ఆయా ప్రశ్నలకు వర్మ సమాధానమిచ్చారు. కాగా, తన చిత్రాల్లో హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకు ఎక్కువ ఖర్చుపెడతానని వర్మ సమాధానం చెప్పిన సందర్భంలో ఆ కళాశాల విద్యార్థినులు ఒకింత ఇబ్బంది పడాల్సి వచ్చింది.