: క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించం: తెలంగాణ ఇంటర్ బోర్డు డైరెక్టర్
మార్చి 2 నుంచి జరగనున్న తెలంగాణ ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 1,257 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 4,56,655 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్ష రాయనున్నారని, 5,08,009 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించారు. పరీక్ష మొదలవడానికి 15 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. లేకుంటే క్షణం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ ల నుంచి ఎంఎంఎస్, ఎస్సెమ్మెస్ లను ముందుగానే కనుగొనేందుకు జీపీఆర్ఎస్ తో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.