: బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ!
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. ఇవాళ ఆ జిల్లాలో ఐకేపీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఫోటో లేదు. ఇది గమనించిన భూపతి అనుచరుడు, జిల్లా మండలాధ్యక్షుడైన వెంకట్ ఫోటో విషయంపై బాజిరెడ్డిని అక్కడికక్కడే నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఉన్నట్టుండి వెంకట్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి చేయిచేసుకున్నారు. దాంతో ఆగ్రహించిన భూపతిరెడ్డి బాజిరెడ్డిపైకి వెళ్లారు. ఇదే సమయంలో ఇద్దరి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మండలాధ్యక్షుడు వెంకట్ కు రక్తం వచ్చేలా దెబ్బలు తగిలాయి. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని అడ్డుకుని శాంతింపజేయడంతో గొడవ సర్దుమణిగింది.