: బెజవాడలో వర్మ ‘వంగవీటి’ చర్చలు షురూ!... కాసేపట్లో లగడపాటి, దేవినేని నెహ్రూతో భేటీ
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సందడి షురూ అయ్యింది. దివంగత నేత వంగవీటి మోహన రంగ జీవితం ఆధారంగా తాను తెరకెక్కిస్తున్న ‘వంగవీటి’ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు నిన్న రాత్రికే వర్మ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో వర్మను రిసీవ్ చేసుకున్న ఆయన అభిమానులు హోటల్ దాకా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. వచ్చీరాగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోని ఆయన నిన్న రాత్రే వంగవీటి రంగా అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగాకు సంబంధించి పలు కీలక వివరాలను ఆయన వారి నుంచి సేకరించారు. తాజాగా మరికాసేపట్లో హోటల్ గది నుంచి బయటకు రానున్న వర్మ... నేరుగా తన స్నేహితుడు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వద్దకు వెళ్లనున్నారు. లగడపాటితో భేటీ ముగియగానే అక్కడి నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వద్దకు వెళతారు. రాజకీయ ప్రముఖులతో వర్మ వరుస భేటీల నేపథ్యంలో విజయవాడలో సందడి వాతావరణం నెలకొంది.